యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 125 కిలోల బంగారాన్ని విరాళాలుగా సేకరించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ విరాళాలను యాదాద్రి ఆలయ స్వామివారికి సమర్పించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం కోసం మేడ్చల్ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.1.83 కోట్లను గురువారం నాడు యాదాద్రి ఆలయ ఈవోకు అందజేశారు. ఈ నగదుతో మూడున్నర కిలోల బంగారం సమకూరుతుంది.
Read Also: తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు
కాగా అంతకుముందు మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఘట్‌కేసర్ క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇంఛార్జి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.