Komatireddy Venkat Reddy: సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మాది సెక్యూలర్ ప్రభుత్వమని, మాకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయం అని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన, ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ పాలన మరింత బలోపేతం అవుతుందని, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే బీసీనీ సీఎం చేస్తామని చెప్పిన బీజేపీ, ఓ బీసీ నేత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అతన్ని పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. వాళ్ల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు, ఇప్పుడు వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి రాకతో దురాజ్ పల్లి లింగమంతుల జాతర వైభవంగా సాగుతోంది.