మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. దావోస్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు. రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ప్యాలెస్ నిరుపయోగంగా ఉందని, ఎందుకు పనికి రావడం లేదన్నారు. ప్యాలెస్ నిర్మాణం కారణంగా టూరిజనికి వచ్చే ఆదాయానికి గండి పడిందని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.
‘ఈ నెల 27వ తేదీన విశాఖపట్నంలో పర్యటనశాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. పర్యాటక ప్రాజెక్టులు అమలుపై చర్చ జరుగుతుంది. రూ.170 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఇందులో 95 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న సంబంధాల కారణంగా నిధులు వెంటనే మంజూరు అయ్యాయి. 25 కోట్లతో నాగార్జున సాగర్ దగ్గర రెండు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుంది. ఆఖండ గోదావరి ప్రాజెక్టుకి రెండు, మూడు రోజుల్లో టెండర్లు నిర్వహిస్తాం. పుష్కరాలు నాటికి పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది. గండికోట ఆధునీకరణ పనులు చేపట్టి హెరిటేజ్ గా అభివృద్ధి చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పడుతున్న కారణంగా పర్యాటకంగా రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది’ అని మంత్రి దుర్గేష్ తెలిపారు.