తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. మునుగోడులో జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థులను దాటి ముందుకు వెళ్లేందుకు ఇంటింటి ప్రచారాలు, హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నిక బరిలో ఉండగా, టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతిలు పోటీలో ఉన్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎండగడుతూ తమ పార్టీ అభ్యర్థికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక కుట్ర, స్వార్థం వల్ల వచ్చిందన్నారు. డబ్బు, అహంకారం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చిందని ఆయన ఆరోపించారు.
Read Also : Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నిక ఆర్వోపై వేటు
ఇది కేవలం బీజేపీ రాజకీయ స్వార్థం కొరకు వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ఒక దళిత వ్యతిరేక పార్టీ, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా వ్యతిరేక పార్టీ అంటూ ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ భారత్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం ఇంకా దిగజారిపోతోందని, ప్రతి ఒక్కరికీ రెండు పూటలా అన్నం పెట్టేల తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలి అని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారన్నారు. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మమ్మలని తెలంగాణలో కలపండి అని అడుగుతున్నారని, ఒక రైతు చనిపోతే వారంలో 5 లక్షలు వస్తున్నాయి… అది కేవలం తెలంగాణలో మాత్రమే సాధ్యమయ్యిందని ఆయన వెల్లడించారు. ఉచిత కరెంట్ ఇచ్చేది మన తెలంగాణ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.