Minister Jagadish Reddy about Munugodu By Poll
తెలంగాణలోని రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మునుగోడు గులాబీ జెండా ఎగురవేయాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓ వైపు.. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి మరో వైపు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే.. తాజాగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలను చూస్తుంటే ఈన్నాళ్ళుగా ఈడీని దుర్వినియోగం చేశారనే విషయం అర్థమవుతుందన్నారు.
ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనడానికి ఈవ్యాఖ్యలు నిదర్శనమన్నారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈడీలు ఏమి చేయలేవని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని ఆయన ప్రకటించారు. మునుగోడలో వామపక్షాల ఓట్లు కీలకమన్న జగదీష్ రెడ్డి.. వామపక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు వామపక్షాలు, కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు లో బీజేపీకి మూడవ స్థానమే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.