Minister Sandhya Rani: అరకు కాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నాం.. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతాం అన్నారు. అరకు కాఫీని గత టీడీపీ ప్రభుత్వం బ్రాండింగ్ చేసి.. ప్రమోట్ చేసింది. ఇప్పుడూ అదే తరహాలో అరకు కాఫీని మా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని వెల్లడించారు. ఇక, నెలకోసారి గిరిజన హాస్టళ్లల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల పనులు చాలా వరకు జరగలేదు. 554 ట్రైబెల్ స్కూళ్లల్లో ఏఎన్ఎంలను డెప్యూటేషన్ మీద నియమిస్తున్నాం. ఫీడర్ అంబులెన్స్, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి సేవలను పునరుద్దరిస్తున్నాం. హాస్టళ్లల్లో స్టడీ అవర్స్ తిరిగి ప్రారంభిస్తాం అని పేర్కొన్నారు.
Read Also: Asaduddin Owaisi: ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్‌సభలో దుమారం..
మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లో 2 వేలకు పైగా పోస్టులు గిరిజన స్కూళ్లల్లోనే ఉన్నాయని తెలిపారు మంత్రి సంధ్యారాణి.. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వం రేషన్ డిపోలను రద్దు చేసింది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తున్నాం. జీసీసీ ద్వారా నిర్వహించే సంస్ధలను.. ఉత్పత్తులను మరింత ప్రోత్సహిస్తాం అన్నారు. ఇకపై గిరిజన విద్యార్థుల మరణాలు ఉండకూడదని అధికారులను ఆదేశించాం.. పౌష్టికాహారం అందక గిరిజన పిల్లలు చనిపోకూడదు. గిరిజన బాలికల హాస్టళ్లల్లో మహిళ వార్డెన్లనే నియమిస్తాం. గిరిజన హాస్టళ్లల్లో కంప్లైంట్ బాక్సులు పెడతామన్నారు.
Read Also: Fire Accident: జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు
ఇక, గంజాయి వల్ల ఎక్కువగా పిల్లలు, ఆడపిల్లలే బాధితులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంధ్యారాణి.. గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో తెలియని విధంగా దారుణాలు చేస్తున్నారు. దీంతో.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి కట్టడికి చెక్ పోస్టులు పెట్టాలని ఆదేశించాం. గిరిజన ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఐటీడీఏలకు ఆదేశాలిచ్చాం. మరోవైపు.. మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు ఇళ్ల నిర్మాణం చేపడతాం అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.