Dharmana Prasada Rao: పేదల ప్రభుత్వం అంటే మాదే.. కానీ, కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకి అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను నేటి ప్రభుత్వం విధ్వంసం చెసినట్లుమాటాడారని మండిపడ్డారు. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుండేదని హితవుపలికారు. తోటపల్లి, వంశదార, ఆప్ షోర్ ప్రారంభించింది వైఎస్ రాజశేఖ రెడ్డి అని గుర్తుచేశారు. కనీసం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేసిన బాబు.. ప్రాజెక్టులపై ప్రశ్నించడం ఏంటి..? అని నిలదీశారు.
1996లో సీఎం అయి 14 ఏండ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏం చేశారు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా..? అని నిలదీశారు.. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా..? మా ప్రభుత్వం నాలుగేళ్లు అయ్యింది.. అందులో రెండేళ్లు కరోనా మహమ్మారే.. అయినా 97 శాతం పనులు అయ్యాయని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ సమావేశం అయ్యారు.. రెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకువస్తున్నాం అన్నారు. ట్రిబ్యునల్ వేయించావా? సమస్య పరిష్కారానికి ఒడిశా సీఎంతో మాట్లాడారా? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు 14 ఏళ్లలో శాశ్వత పరిష్కారం సూచించలేదని దుయ్యబట్టారు.. అయితే, రక్షిత తాగునీరు అందించేందుకు 700 కోట్లు కేటాయించి, ఒక్క టెర్మలోనే సర్పేస్ వాటర్ అందిస్తున్నాం.. కిడ్నీ రోగులకు, హాస్పిటల్ రీసెర్చ్ ఇన్టిట్యూషన్ , త్రాగునీరు , డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కదా పేదల ప్రభుత్వం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
14 ఏళ్లలో చేసిన కార్యక్రమం ఏంటి ..? ఎవరైనా మిమ్మల్ని నాడు అడ్డుకున్నారా..? అని చంద్రబాబును నిలదీశారు మంత్రి ధర్మాన.. గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు..? అని ప్రశ్నించిన ఆయన.. బాబు మాటను ప్రజలు నమ్మరని తెలిపారు. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టిన ఆయన.. వ్యవసాయం దండగ అన్నది బాబే.. అతను రాసిన మనసులో మాట పుస్తకంలోనే ఆ విషయం ఉందని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.