Chelluboina Venu Gopala Krishna: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది.. 27 నియోజకవర్గాల్లో మార్పులతో సెకెండ్ లిస్ట్ విడుదల చేసింది.. మూడు ఎంపీ స్థానాలు, 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్పులు చేసింది.. ఇప్పటి వరకు మొత్తం 38 సెగ్మెంట్లలో మార్పులు చేసింది వైసీపీ.. ఇక, రామచంద్రాపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జి చెల్లుబోయిన వేణు.. ట్రబుల్ షూటర్ ను కాబట్టి నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపించారని తెలిపారు. తొలి సారి రాజమండ్రి రూరల్ లో వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రామచంద్రపురం లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ లో 15 ఏళ్లుగా టీడీపీ నే గెలుస్తూ వస్తుంది.. కానీ, ఈ సారి వైసీపీ జెండా ఎగురవేస్తాం అన్నారు. అందరిని కో ఆర్డినేట్ చేసుకుంటాను అని వెల్లడించారు. వైసీపీలో వైఎస్ జగన్ వర్గం ఒకటే ఉంటుంది.. తప్ప.. మరో వర్గం ఉండదని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
కాగా, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాలకృష్ణ మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.. కొన్ని సందర్భాల్లో అధిష్టానం జోక్యం చేసుకుని సర్దిచెప్పింది.. ఇప్పుడు.. పిల్లి సుభాష్ కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇచ్చి.. మంత్రి వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కి పంపించింది వైసీపీ అధిష్టానం.