Botsa Satyanarayana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురంధేశ్వరి సంక్షేమం, అభివృద్ధి గురించి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉందని వ్యాఖ్యానించడం సరికాదని హితవుపలికారు. మరి దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్న రాష్ట్రల అప్పుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మీ బీజేపీ ఎంపీ దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని ప్రస్తావించారు.. మరి మిగిలిన ఆరు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించరు ? అని నిలదీశారు.
Read Also: Dubai Sheikh’s Hummer: దుబాయ్ షేకా మజాకా.. అతని కారు ముందు ఫ్లైట్ కూడా వేస్టే..
ఇక, రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీకి ప్రత్యేక హోదా, మీరు ఇచ్చిన విభజన హామీలపై ఎందుకు మాట్లాడరు అంటూ పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స.. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూడలేక ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. పార్టీలో ఏదైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఏ కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది.. మళ్లీ జిల్లాలో ఉన్న నాలుగు స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. కాగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.. ముఖ్యంగా.. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఆమె ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.