Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయానని.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యథేచ్ఛగా తిరిగారని ఆయన అన్నారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్‌లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని.. ఈ ఆరు బూత్‌లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలని.. ఈ ఆరు బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు.
Read Also: TDP vs YCP Fight: వాదంపల్లిలో ఉద్రిక్తత.. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
కొత్తగణేషం పాడు గ్రామంలో టీడీపీ దాడులు చేస్తోందని.. మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. గుళ్లల్లో దాక్కున్న మహిళల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వద్దకు వెళ్తోన్న కాసు మహేష్, అనిల్ యాదవ్ వంటి వాళ్ల పైనా దాడులు చేశారని.. పల్నాడంతా అరాచకంగా ఉందన్నారు. పల్నాడులో రఫ్ కల్చర్ ఉంటుందని.. కానీ ఈసారి ఇంత రఫ్‌గా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. తన రికమెండేషనుతో వేసిన ఎస్ఐ, సీఐలు వేరే వారికి అమ్ముడుపోయారని.. ఎవరేం చేయగలరని ఆయన ఆరోపించారు. పల్నాడు పుట్టిన తర్వాత ఇంతటి అరాచకం ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.