TDP vs YCP Fight: ఏపీలో ఎన్నికలు ముగిసినా గొడవలు మాత్రం ఆగడం లేదు. సోమవారం పోలింగ్ సమయంలో చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలోకి టీడీపీ వర్గీయులు నీటి ట్యాంకర్ల సరఫరాను ఆపేశారు. వైసీపీ వర్గీయులు గ్రామంలో నీటి సరఫరా చేస్తుండడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
Read Also: AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
గ్రామంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడిపాడు గ్రామం నుండి 200 మంది వాదంపల్లి గ్రామంలో ఒక వర్గానికి మద్దతుగా దాడికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే 50 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, బీఎస్‌ఎఫ్ జవాన్లు, స్పెషల్ పార్టీ పోలీసులు, లోకల్ పోలీసులు మొత్తం 50 మంది పోలీసులు గ్రామంలో గొడవను సద్దుమణిగేలా చేశారు. బయట నుంచి వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించివేశారు. పోలీసుల వలయంలో వాదంపల్లి గ్రామం ఉండడం గమనార్హం.