మాజీ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు కోర్టు, బయట సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. రోలాండ్ గారోస్‌లో అద్భుత విజయం తర్వాత.. నిషేధిత పదార్థం తీసుకోవడంతో ఓ నెల సస్పెన్షన్ కారణంగా ప్రత్యర్థి అరినా సబలెంకాకు అగ్రస్థానాన్ని కోల్పోయింది. అప్పుడు స్వైటెక్ కెరీర్ ప్రమాదంలో పడింది. స్వైటెక్ తన స్థానాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్న సమయంలో మయామి ఓపెన్‌లో ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది.
మయామి ఓపెన్ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగా స్వైటెక్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమె కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దాంతో మియామి ఓపెన్‌లో ఆమెకు అధికారులు అదనపు భద్రత కేటాయించారు. సదరు ప్రేక్షకుడు డ్జోనీ బ్రావోగా గుర్తించారు. విషయాన్ని టోర్నమెంట్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లామని, వెంటనే స్వైటెక్‌కు భద్రతను పెంచారని ఆమె ప్రతినిధి పేర్కొన్నారు. క్రీడాకారిణుల భద్రత అత్యంత ప్రాధాన్యమైన విషయం అని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని టోర్నమెంట్ నిర్వాహకులను మహిళల టెన్నిస్ అసోషియేషన్ ఆదేశించింది.
Also Read: Sunil Gavaskar: ఆ డబ్బును గౌతమ్ గంభీర్ వెనక్కి ఇచ్చేస్తాడా?
ఈ సమయంలో కూడా ఇగా స్వైటెక్ మంచి ఆటను ప్రదర్శించింది. మయామి ఓపెన్‌లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్‌పై 7-6(2), 6-1 తేడాతో విజయం సాధించి నాల్గవ రౌండ్‌కు చేరుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్ సందర్భంగా బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంది. ఇది ఆమె ప్రదర్శనపై ప్రభావితం చూపింది.