రానున్న కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది ఎంజీ మోటార్స్. తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం వరకు పెంచుతామని MG మోటార్స్ ప్రకటించింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లలో ఒకే విధంగా ఉండదు, కానీ వాహనాన్ని బట్టి మారుతుంది. కంపెనీ ఇటీవల కొత్త హెక్టర్ SUVని విడుదల చేసింది. ఈ SUV ధరను అలాగే ఉంచనున్నట్లు తెలిపింది.
దాని డీజిల్ వేరియంట్ల ధర కూడా ఇంకా విడుదల కాలేదు. నిరంతరం పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల, కొత్త సంవత్సరం నుండి ధరను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. MG భారత మార్కెట్లో ICE నుంచి EV విభాగాల వరకు విస్తృత శ్రేణి వాహనాలను విక్రయిస్తుంది. కంపెనీ MG కామెట్ EV, ZS EV, విండ్సర్ EV, హెక్టర్, గ్లోస్టర్ వంటి కార్లను అందిస్తుంది. ధరలు పెరగనున్న నేపథ్యంలో కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నవారు డిసెంబర్ నెల ముగిసే లోపు ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.