అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దైపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. హైదరాబాద్ లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముసురు వానలు పడుతుండడంతో వినాయక చవితి వేడుకలకు ఆటంకం ఏర్పడింది.
నేడు హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశారు. గురువారం కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించారు.