ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు.
ఈ నెల 16న సుధేష్ణ నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్ణ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. సుధేష్ణకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్‌లోని తన నివాసంలో మూడో అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏడు తులాల బంగారు నగలు పోయాయని సుధేష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.