Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని తారాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. దుర్గా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా గార్బా నృత్యం చేస్తూ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలాడు. స్థానికులు వెళ్లి పరిశీలించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మరణించాడు.
తారాపూర్‌లోని ఆనందలో శివశక్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల వీరేంద్ర సింగ్ రమేష్ గార్బా డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయాడు. అతడి అన్న రాజ్‌పుత్ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మరణించాడు. అయితే వీరేంద్ర మరణానికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. వీరేంద్ర నృత్యం చేస్తూ పడిపోయిన వీడియోను అక్కడ స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
ఇటీవలి కాలంలో ఇలా డ్యాన్స్ చేస్తు్న్న సందర్భంలో మృత్యువాత పడుతున్న ప్రజల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా అప్ లోడ్ అవుతున్నాయి. అంతకుముందు, జమ్మూలో లైవ్ షో సందర్భంగా 20 ఏళ్ల కళాకారుడు స్టేజ్‌పై మరణించగా, బరేలీలో పుట్టినరోజు పార్టీలో తన నృత్య నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కుప్పకూలి మరణించాడు.
Read Also: Araku Coffee: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్.. కప్పు కాఫీ రూ.637
అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది..
సాధారణంగా గుండెకు రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య చాలా పెరిగిపోతోంది. గుండెపోటు వచ్చిన వారు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడే వారు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం మేలంటున్నారు. గుండెనొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టెన్షన్‌కు గురి కావడం, ఒత్తిడి, అధిక ఆలోచన ఇలా రకరకాల ఒత్తిళ్లకు గురయ్యే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుండె నిపుణులు చెబుతున్నారు.