Araku Coffee: చాలా మంది ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగనిదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్‌ను అరకు కాఫీ విదేశీ మార్కెట్‌లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా కాఫీ తోటలకు అధికంగా సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటకలో ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి డిమాండ్ పెరిగింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలకు కిలో రూ.150 నుంచి రూ.180 ధర మాత్రమే పలికేది. గత ఏడాది మాత్రం కిలో కాఫీ గింజలు రూ.350 నుంచి రూ.380 పలకడం విశేషం.
అటు ప్రస్తుతం జపాన్‌లో అరకు కాఫీ గింజలతో తయారు చేసిన కప్పు కాఫీని రూ.637కు విక్రయిస్తున్నారు. అరకు ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంటుంది. ఈ ఏడాది మాత్రం 20 నుంచి 25 శాతం వరకు అధికంగా పంట వస్తుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. బెంగళూరులోని అనేక ప్రైవేట్ సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరించి వాటిని శుద్ధి చేసి ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌గా మార్చి ప్యాకింగ్ చేస్తుంటాయి. చాలా మంది వ్యాపారులు బెంగళూరు కేంద్రంగానే అరకు కాఫీ పొడిని బ్రెజిల్, జపాన్ వంటి పెద్ద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.