హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు.
Read Also: కుటుంబ కలహాలు.. నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం
దీంతో యాసిన్ ఆవేశానికి లోనయ్యాడు. 10 నిమిషాల తరువాత కత్తితో వచ్చి బిద్యాధర్ మెడ, ఛాతిలో పొడిచాడు. ఈ ఘటనలో బిద్యాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని షాపూర్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బిద్యాధర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.