Himanta Sarma: ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ ‘GOAT టూర్ 2025’ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. ముఖ్యమంత్రి, హోంమంత్రి మమతా బెనర్జీని, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను అరెస్ట్ చేసి ఉండాలి’’ అని అన్నారు. ఈవెంట్ నిర్వాహకుడిని అరెస్ట్‌ను తాను సమర్థించడం లేదా వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. మొదటి బాధ్యత హోం మంత్రి, పోలీస్ కమిషనర్లదని చెప్పారు.
Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
బెంగాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. సింగర్ జుబీన్ గార్గ్ మరణం తర్వాత గౌహతిలో జరిగిన భారీ ప్రజా సమావేశాలు, ముంబైలో మహిళ ప్రపంచకప్ నిర్వహరణ ఎంతో బాగా జరిగాయని, కానీ బెంగాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఊహించలేని రాష్ట్రమని, అక్కడి VIP సంస్కృతి తీవ్ర స్థాయిలో ఉందని మండిపడ్డారు. ‘‘మెస్సీ మొత్తం ప్రపంచానికి ఆదర్శం. మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బెంగాల్లో ప్రతిరోజూ అమాయక ప్రజలు దారుణాలకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం’’ అని హిమంత అన్నారు.
ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ పాల్గొన్న కోల్‌కతా ఈవెంట్లో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి తాను “తీవ్రంగా కలత చెందానని, షాక్ అయ్యానని” శుక్రవారం బెనర్జీ అన్నారు. అర్జెంటీనా స్టార్ మెస్సీ కొద్దిసేపు కనిపించిన తర్వాత వేదిక లోపల గందరగోళం చెలరేగడంతో క్రీడా అభిమానులకు ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ దురదృష్టకర సంఘటనకు లియోనల్ మెస్సీకి, అలాగే క్రీడా అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు మమతా బెనర్జీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ చుట్టూ వీఐపీలు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండటంతో, ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఉన్న అభిమానులు మైదానంలోకి ప్లాస్టిక్ బాటిళ్లు, కుర్చీలు, టెంట్లు విసిరేశారు.