దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్ అయింది. గురువారం చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ ఛేదనలో టీమిండియా కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. మంచి పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో సఫారీలు సిరీస్‌ను 1-1తో సమం చేశారు.
200 పరుగులకు పైగా టార్గెట్ ఏ జట్టుకైనా పెద్ద సవాలు. కానీ టీ20 క్రికెట్‌లో భారీ లక్ష్యాలను కొన్ని టీమ్స్ చాలాసార్లు ఛేదించాయి. టీ20 క్రికెట్‌లో అగ్ర టీమ్ అయిన భారత్ మాత్రం తడబడుతోంది. భారీ లక్ష్యం అంటే టీమిండియా బెంబేలెత్తిపోతోంది. గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. భారత జట్టు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 210+ పరుగుల లక్ష్యాన్ని ఇంతవరకు ఛేదించలేదు. భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు 210 పరుగులకు పైగా లక్ష్యాలను ఛేదించేందుకు బరిలోకి దిగింది. కానీ అన్ని మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఈ గణాంకాలు భారత బ్యాటింగ్ బలహీనతను చూపిస్తోంది.
Also Read: Ather Rizta Milestone: ఏథర్ అరుదైన మైలురాయి.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ‘రిజ్తా’!
రెండో టీ20 మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరూ ప్లేయింగ్ XIలో ఉన్నప్పటికీ.. భారత్ ఓడిపోయింది. నిజానికి ఈ ఇద్దరు టీ20 క్రికెట్‌లో కలిసి ఆడిన అన్ని మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. 14 మ్యాచ్‌ల తర్వాత ఆ విజయ పరంపరకు పులిస్టాప్ పడింది. ఈ జోడి చాలా కాలంగా భారత బౌలింగ్‌కు వెన్నెముకగా ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ బౌలర్లు విఫలమయ్యారు. అర్ష్‌దీప్ తన కోటా 4 ఓవర్లలో 54 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. బుమ్రా 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేదు. వరుణ్ చక్రవర్తి మాత్రం 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు.