అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి అదృశ్యం అయ్యాడు. తన భర్తను ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ సబిత పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో గాలించారు. చివరకు సబిత భర్త జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు సబిత, జనార్ధన్ రెడ్డి డ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసం సబిత ఇలా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి జనార్ధన్ రెడ్డి ప్రచారం చేస్తుండగా.. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకుని పరుగెత్తాడని డీఎస్పీ నరేందర్ గౌడ్ చెప్పారు. వరి చేన్లలో పరుగెత్తుతుండగా దెబ్బ తాకిందని, సృహ కోల్పోయానని జనార్ధన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై డీఎస్పీ సమగ్ర విచారణ చేస్తున్నారు.