పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పులే గుర్తురాలేదా? ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టాక గుర్తొచ్చిందా? అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు మహిళలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్ ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు? అని ఆయన అన్నారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణత్మకంగ విమర్శలు చేయండి… మాయ మాటలు కాదని, గతంలో ఎప్పుడు లేనంతగా మా ప్రభుత్వం సామాజిక న్యాయంకు పెద్దపీట వేసిందన్నారు మల్లు రవి.
ప్రజా ప్రభుత్వం అని రాష్ట్రంలోని ప్రజలు భావిస్తున్నారని, సీఎంఓ నుండి కమిషరేట్ ల వరకు… సింగరేణి నుండి హెల్త్ డైరెక్టర్ ల వరకు.. సామాజిక న్యాయం పాటించామన్నారు మల్లు రవి. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో తనవంతు కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభించడానికి ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు.