తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. దీంతో ఓయూలో పురుషుల హాస్టళ్లు కంటే మహిళల హాస్టళ్లు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
పీజీ కోర్సుల్లో ఇప్పటి వరకు 41,174 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 4వేల సీట్లు వచ్చే అవకాశముంది. వీరిలో 70 శాతం సీట్లు మహిళలకే దక్కనున్నాయి. సంప్రదాయ పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తాజా ఫలితాలతో పురుషులు పీజీ కోర్సులపై అనాసక్తితో ఉన్నారని అర్థమవుతోంది. ఎంకామ్ లాంటి కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే తక్కువ మంది అర్హత సాధించారు. కాగా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో 4,080 మంది ముస్లిం మహిళలు క్వాలిఫై కాగా వారి కంటే 5 రెట్లు తక్కువగా ముస్లిం పురుషులు అర్హత సాధించారు.