Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. ‘‘ఇండియా ఔట్’’ని నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను మాల్దీవుల్లో మానవతా సేవల్లో పాలుపంచుకుంటున్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మే 10 లోగా భారత్ సిబ్బంది అంతా మాల్దీవుల నుంచి వెళ్లిపోతున్నారు. మరోవైపు ముయిజ్జూ భారత్ వ్యతిరేకతతో చైనాకు దగ్గరవుతున్నారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత భారత్‌ని కాదని ముందుగా చైనాలో పర్యటించారు. ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు.
Read Also: Covishield: కోవిషీల్డ్ మరణాలకు కారణమైందా..? కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు..
ఇదిలా ఉంటే భారత్, మాల్దీవులకు విరాళంగా ఇచ్చిన మూడు విమానాలను ఆపరేట్ చేసే సామర్థ్యం తన పైలట్లకు లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్ అంగీకరించారు. భారత్ సిబ్బందిలో చివరి బ్యాచ్ ఆ దేశాన్ని వదిలి పెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాలను నడిపేందుకు లైసెన్స్ పొందిన వ్యక్తులు ఎవరూ లేరని ఆదివారం మాలేలో జరిగి మీడియా సమావేశంలో మౌమూన్ వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో విమానాలు నడిపేందుకు మాల్దీవుల సైనికులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైనా ఆ కార్యక్రమం పూర్తి కాలేదని చెప్పారు.
ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య జరిగి ఒప్పందం ప్రకారం మే 10లోగా భారత్ సిబ్బంది మాల్దీవుల నుంచి వెనక్కి వెళ్లిపోవాలి. స్నేహం కారణంగా మాల్దీవులకు భారత్ హెలికాప్టర్, ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని విరాళంగా ఇచ్చింది. ఇదిలా ఉంటే మాల్దీవులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. ముఖ్యంగా పర్యాటకంపై ఆధారపడిన ఈ దేశం భారత్‌పై, ప్రధాని నరేంద్రమోడీపై ముయిజ్జూ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశానికి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చైనాకు చెందిన పర్యాటకులు మాల్దీవులకు వస్తున్నప్పటికీ, భారత్ నుంచి వచ్చే పర్యాటకులు పెట్టే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు పెడుతుండటంతో అక్కడి పర్యాటకానికి గిట్టుబాటు కావడం లేదు.