నారాయణపేట జిల్లా పై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరుకానున్నారు. జిల్లా పరిధిలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి రానుండగా.. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ రెండు బహిరంగ సభలు కేవలం గంట తేడాతో జరగనుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయపరమైన ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటుంది.
READ MORE: Virat Kohli Six: విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్సర్.. వీడియో వైరల్!
ఎన్నికల ప్రచారాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఒకే జిల్లా.. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో గంట తేడాతో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని బహిరంగ సభలు జరుగుతూ ఉండటం ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీలో బరిలో నిలిచారు. కాగా, నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మక్తల్‌లో నిర్వహించే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఒక గంట తేడాతో పక్కపక్కన ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జన సమీకరణ చేయడం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కత్తి మీద సాముల మారింది. ప్రధానమంత్రి సభకు గానీ, ముఖ్యమంత్రి సభకు గానీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని నాయకులు భావిస్తున్నారు. ఈ సభలు పోలీసులకు తలనొప్పిగా మారింది. భారీ ఎత్తున వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, సమావేశం జరుగుతున్నప్పుడు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతున్నాయి. పీఎం, సీఎం సభలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.