ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని, రాష్ట్రంలో ఏనాడైనా పంటల బీమా డబ్బులు కానీ, కరువు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఏనాడైనా కేసీఆర్ రైతుల వద్దకు పోయారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంపొయాక ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రైతు బంధు, పంటల బీమా గురించి కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ మాయ మాటలు ఇంకా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, వరి వేస్తే ఉరి వేసినట్టే అని రైతులను భయపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వరి పంటలను చూసారని ఆయన పేర్కొన్నారు. కరవు కు కారణం కాంగ్రెస్ అని కేసీఆర్ మాట్లాడ్డం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింత ప్రాజెక్టు.. మెడిగడ్డ కూలిపోయి నీటిని వదిలితే ఆయన తన తప్పిదాన్ని కప్పిపుచుకొని అబద్దాలు ఆడుతున్నారని, ఎన్ని చెప్పిన కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ రాజకీయాలు ఇంకా ముగిసినట్టేనని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.