Pakistan: పాకిస్థాన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు. లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్‌లోని చారిత్రాత్మక కటాస్ రాజ్ ఆలయంలో మార్చి 9న ఈటీపీబీ నిర్వహిస్తున్న మహాశివరాత్రి ప్రధాన కార్యక్రమం జరుగుతుందని, ఇందులో వివిధ రాజకీయ, సామాజిక, మత పెద్దలు హాజరవుతారని అమీర్ హష్మీ తెలిపారు.
Read Also: Bomb Alert : ముంబై టు బెంగళూరు విమానంలో బాంబు.. భార్య కోసం అబద్ధం చెప్పిన భర్త
విశ్వనాథ్ బజాజ్ నేతృత్వంలో వచ్చిన హిందువులకు వాఘా వద్ద ధార్మిక స్థలాల అదనపు కార్యదర్శి రాణా షాహిద్ సలీమ్ స్వాగతం పలికారు. యాత్రికులు మార్చి 10న లాహోర్‌కు తిరిగి వస్తారు. మార్చి 11న లాహోర్‌లోని కృష్ణ దేవాలయం, లాహోర్ కోట, ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మార్చి 12న భారత్‌కు తిరిగి రానున్నారు. పాకిస్తాన్‌లోని కటాస్‌రాజ్ ఆలయానికి తీర్థయాత్రకు బయలుదేరే ముందు, భక్తులు బుధవారం అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయాన్ని సందర్శించారు. మార్చి 6 నుంచి 12 వరకు పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న కటాస్ రాజ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారతీయ హిందూ యాత్రికులకు పాకిస్థాన్ హైకమిషన్ వీసాలు జారీ చేయడం గమనార్హం.