వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
మహా శివరాత్రి జాతర కోసం వివిధ డిపోల నుండి 778 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. వేములవాడ బస్టాండ్ నుండి ఆలయం వరకు 14 ఉచిత బస్సులను నడపనున్నారు. భక్తుల సమాచారం కోసం మహా శివరాత్రి జాతర టోల్ ఫ్రీ నెంబర్ 18004252038 అని ప్రకటించారు. రాజన్న ఆలయ పరిసరాల్లో పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 5 లక్షల లడ్డూలను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి సాయంత్రం 7 గంటలకు స్వామివార్లకి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 7.30లకి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పి అఖిల్ మహాజన్, ఈఓ వినోద్ రెడ్డి ఏర్పాట్లపై దృష్టి సారించారు.
కాళేశ్వరం క్షేత్రంలో నేటి నుండి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ఊరేగింపు, ఎదుర్కోలు సేవ ఉంటుంది. రేపు సా.4.35కి శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం,రాత్రి 12కి లింగోద్భవ పూజ జరగనుంది. 27న పూర్ణహుతి, ఆదిముక్తీశ్వరాలయంలో స్వామి వారి కల్యాణం ఉంటుంది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు రానున్నారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.