మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మతపరమైన పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, ఇతర మతపరమైన నగరాల పరిమితుల్లో మద్యం అమ్మకాలు నిషేధించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
మద్యపాన నిషేధం గురించి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని మతపరమైన నగరాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో మద్యం పాలసీల్లో దీన్ని సవరిచాలనుకుంటున్నాం. ఈ అంశంపై స్పందించాలని సాధువులు, ఋషులు కూడా మమ్మల్ని అభ్యర్థించారు. అందుకే ఈ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో దీనిని అమలు చేస్తాం. మతపరమైన ప్రాంతాలు, దేవాలయాలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మద్యం విక్రయించవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేయబోతున్నాం.” అని తెలిపారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని భర్తీ చేయడానికి, మతపరమైన నగరాల సరిహద్దుల వెలుపల మద్యం దుకాణాలను తెరవడంపై ఎక్సైజ్ శాఖ అధికారులు మేధోమథనం చేస్తున్నారు.
READ MORE: Reward For Having 4 Children: బంపర్ ఆఫర్.. నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి.. ఎక్కడంటే?
రాష్ట్రంలోని మతపరమైన నగరాల్లో మద్య నిషేధంపై సీఎం మోహన్ యాదవ్ చేసిన ప్రకటనకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీ స్పందించారు. సీఎం యాదవ్ రోజుకో కొత్త వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. కమీషన్ తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌పై ఆర్థిక భారం మోపుతున్నారని పట్వారీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నిస్సహాయంగా మారుతున్నాయని.. రాష్ట్రంలో మాఫియాలు ఎక్కువైపోతున్నాయని విమర్శించారు.