Andhrapradesh: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రముఖుల రాజీనామాలు, చేరికలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. టికెట్ రాని ఆశావహులు నిరాశతో పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీకి భారీ షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బౌలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారనే టాక్ గత కొంతకాలం నుంచి వినపడుతోంది. ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చిన తక్షణం బాలశౌరి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.