మహేంద్రసింగ్ ధోని ఈ పేరుకు క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో విజయాలను అందించి నెంబర్ 1 గా నిలవడంలో మాహీ పాత్ర చెప్పలేనిది. ఎన్నో కప్ లను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఇప్పటికీ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ధోని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్నాడు. అలా ఉంటుంది మరి ధోని క్రేజ్. మిస్టర్ కూల్ కు కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా చాలా గేమ్ వచ్చు. స్వతహాగా ఫుట్ బాల్ గోల్ కీపర్ గా ఉన్న ధోని తరువాత క్రికెటర్ గా మారిన సంగతి ఆయన గురించి తెలిసిన ఎవరికైనా అవగాహన ఉండే ఉంటుంది.
అయితే క్రికెట్ లో హెలికాప్టర్ షార్ట్స్ తో దుమ్మురేపే టీమిండియా మాజీ సారధి టెన్నిస్ కోర్టులోనూ సత్తా చాటుతున్నాడు. టెన్నిస్ మ్యాచ్ లో డబుల్స్ ఆడుతూ కనిపించాడు ధోని. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ధోని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మిస్టర్ కూల్ ఎక్కడైనా సత్తా చాటగలడని కితాబిస్తున్నారు. ఇక ధోని ఐసీసీ మూడు ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక టీమిండియా సారథిగా రికార్డులకెక్కాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ధోనీ దేశానికి అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం ఐపీల్ లో చెన్నై టీంకు సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ టీంకు కూడా ఇప్పటి వరకు ఐదు టైటిళ్లను అందించాడు ధోని. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ధోనిది. అందుకే ఆయన బిహేవియర్ కు కూడా చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారు.