Left Parties: ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి. అలాంటి వ్యక్తికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసును బనాయించడాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. తక్షణమే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Tragedy: విషాదం.. అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
ప్రొఫెసర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రిటైర్డ్ అయిన తరువాత కూడా ప్రా॥ హరగోపాల్ ప్రజాసేవలో వున్నారు. ఉపాధి, త్రాగునీరు, భూసమస్యలు, దళిత, గిరిజనులపై దాడులు తదితర అంశాలపై స్పందిస్తూ సమావేశాలు, సెమినార్లు పెదుతూ ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఆగష్టు 19న ములుగు జిల్లా తడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు. ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో 44వ వ్యక్తిగా హరగోపాల్ పేరుతో నమోదు చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ సమావేశంలో చర్చించారనే నెపంతో 150 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని వామపక్షాలు ప్రకటనను విడుదల చేశాయి. ఉద్యమాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేశారని, డైరీలలో పేర్లు ఉన్నాయని దేశద్రోహం క్రింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డాయి. సుప్రీం కోర్టు అభిశంసించిన దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ప్రొ॥ హరగోపా మరియు ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ప్రభుత్వ ఈ చర్యను నిరసించాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Also Read: Ambati Rambabu: పోలవరంలో జరుగుతున్న విషయాలను దాచాల్సిన అవసరం లేదు..
హరగోపాల్, సంధ్య, విమలక్కలపై కేసులను ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశద్రోహం కేసు బనాయించడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా హరగోపాల్ గురించి తెలుసన్నారు. సమాజం కోసం పనిచేసే వారిపై కేసులు సరికాదన్నారు. ఇదిలా ఉండగా.. విశాఖ ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన స్పందించారు. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే భద్రత లేదంటూ మండిపడ్డారు. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన చోట సీఎం ఇల్లు కట్టుకుంటాడట అంటూ ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థ ఏపీలో నిర్వీర్యమయిపోయిందని ఆయన ఆరోపించారు. విశాఖలో కబ్జాలు జరుగుతున్నాయని అమిత్ షా అంటున్నారని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.