Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పలు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. పొగలు కమ్ముకున్నాయి. ఎల్వివ్, జైటోమిర్, ఖ్మెల్నిట్స్కీ, డ్నిప్రో, టెర్నోపిల్ నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. దేశంలోని అన్ని నగరాల్లో అనేక పేలుళ్లు నమోదవుతున్నాయి. స్థానిక మీడియా ది కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం, కీవ్‌లో శక్తివంతమైన పేలుళ్ల కారణంగా విద్యుత్ అంతరాయం జరిగిందని నివేదించింది. షెవ్చెంకో జిల్లాలో కూడా ఈ పేలుళ్లు సంభవించినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు. పేలుళ్ల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్ చారిత్రక పాత నగరం కాగా.. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బాంబు దాడుల్లో కీవ్‌లోని పలు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. క్రిమియా బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా ఈ భీకర దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఉక్రెయిన్‌ను భూమిపై లేకుండా రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. దేశంలోని పలు నగరాలపై చేసిన క్షిపణి దాడుల్లో అనేక మంది మరణించారని, చాలా మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు పేల్చేసిన సంగతి తెలిసిందే. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం.. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పేలుడులో ఉక్రెయిన్ పాత్ర ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ బలగాలు ఈ వంతెనను పేల్చేసినట్టు రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.
Rajasthan: ఒంటరి మహిళలే టార్గెట్.. ఎదిరిస్తే బెదిరింపులు.. కత్తులతో దాడులు
క్రిమియా బ్రిడ్జిపై దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతోంది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు ఉక్రెయిన్‌పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు తొలుత అంతా భావించారు. కానీ, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సమాచారం.. నిపుణుల విశ్లేషణలు.. క్రిమియా ద్వీపకల్పం బీచ్‌ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్‌ప్లాన్ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.