KTR : హైదరాబాద్ నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో నగరం సౌభాగ్యంగా ఎదిగిందని, కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభాగ్యంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుంచించుకుపోయిందని తెలిపారు.
పేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న ప్రభుత్వం, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేస్తోందని విమర్శించారు. గత త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇండ్ల విక్రయాలు 49% తగ్గాయని, ఆఫీస్ లీజింగ్ రంగం 41% క్షీణించిందని గణాంకాలతో తెలిపారు. వ్యవసాయ రంగంలో మాత్రమే కాదు, రియల్ వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా హితబోధ చేశారు. కూల్చడం కంటే కట్టడాన్ని నేర్చుకోవాలని, అబద్దాల కన్నా అభివృద్ధిని ప్రోత్సహించాలని సూచించారు. “జాగో తెలంగాణ జాగో!” అంటూ తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి, హైదరాబాద్ నగరాభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం..