త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘తొందర్లోనే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు. గత ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదు.. ప్రజలే. ఔటర్ లోపల చాలా సీట్లు గెలిచాం. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు , నిరుద్యోగులు మోసపోయారు. వీళ్ళు చెబితే నమ్మరని.. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో 420 హామీలు ఇప్పించారు. ఒక్కసారి అవకాశం ఇద్దామని మన వారు ఓట్లు వేశారు. అభివృద్ధి చేసిన వైఎస్సార్, చంద్రబాబు గురించి ఇంకా మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేయరు. ఫ్రీ బస్ తప్ప ఏమీ చేయలేదు, దాని గురించి మాట్లాడితే మళ్లీ కేసులు పెడతారు’ అని కేటీఆర్ అన్నారు.
‘మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా?. బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవు. చేవెళ్ల, రాజేంద్రనగర్లలో ఈ ఏడాది తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు రావు అన్నందుకు సీఎం రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటి నుంచే ప్రచారానికి సిద్ధం అవ్వండి. ఈ నెల 27 జరగబోయే వరంగల్ సభను విజయవంతం చేయండి. నాయకులు కూడా బస్సులలో కార్యకర్తలతో కలిసి మీటింగ్‌కు రావాలి. సబితా ఇంద్రారెడ్డి కూడా బస్సులోనే మీటింగ్ వస్తారు. నలబై వేల బస్సులు మీటింగ్‌కు వస్తున్నాయి’ అని కేటీఆర్ చెప్పారు.