పరకాలకు చేరుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిశారు. ఇటీవల పరకాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎస్ఐని సస్పెండ్ చేసి మిగతా అధికారులను కాపాడడం సరికాదన్నారు. పోలీసుల దాడిలో తీవ్ర గాయాలైన మా నాయకులను నన్ను కలవడానికి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు కేటీఆర్. ఏ పార్టీ అధికారం ఉంది కాదు.. పోలీసులు చట్టం, న్యాయానికి లోబడి పని చేయాలన్నారు.
పోలీసుల ఓవరాక్షన్ ఖండించిన కేటీఆర్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. ఈ అంశంలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. దాడులకు భయపడకుండా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండ కట్టాలని కార్యకర్తలకు ధైర్యం నింపారు కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు.