నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదని గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు. కొన్ని పథకాల విషయంలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నాయని, పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశం లో చెప్పారన్నారు కేటీఆర్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి కూడా మేము గుర్తించామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 ఉన్నాయన్నారు. అవన్నీ బుక్ లెట్ లో ప్రచురించి పార్టీ నాయకులకు ఇచ్చామని, అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కేటీఆర్. ఇంటింటికి వీటిని పంచుతామని, పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు కేటీఆర్. తుంగతుర్తి లో ఇద్దరు కార్యకర్తల పై దాడులు చేశారు..
ఈ దాడులను సహించమని ఆయన హెచ్చరించారు. ఇప్పటి నుంచి ఎవరి పైన దాడులు జరిగిన మేము వెళ్లి పరామర్శిస్తామని, పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ బలం, తెలంగాణ గళం బీఆర్‌ఎస్ అని ఆయన ఉద్ఘాటించారు. ల్యాండ్ కృజర్ వాహనాల విషయంలో చిల్లర మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు అని ఆయన మండిపడ్డారు. అవి సొంతానికి వాడుకునే వాహనాలు కాదని, హామీల అమలు పక్కకు పెట్టడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. దివాలాకోరు రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కోలుకోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాలుగు వారాలు పడుతుందన్నారు. ప్రతి రోజు కేసీఆర్ మమ్మల్ని పార్టీ కార్యక్రమాల పై దిశా నిర్దేషం చేస్తున్నారని, ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తరువాత అందరి సమక్షంలో డిక్లేర్ చేస్తామన్నారు. కాళేశ్వరం పై ఏలాంటి విచారణ కైనా మేము సిద్దమని, తప్పు చేస్తే భయపడాలి, మేము ఎటువంటి తప్పు చెయ్యలేదన్నారు.