కేసీఆర్ చెప్పే అబద్దపు మాటలు నమ్మకండి కర్ణాటకలో ప్రతి పథకం అమలవుతోందని తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ గెలిచాక ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఆరు గ్యారంటీలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోకండని, సోనియామ్మ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు వెంకట్ రెడ్డి. కేటీఆర్ కారు కావాలా బేకారు కావాలన్నా అంటున్నారని, సోనియామ్మ తెలంగాణ ఇవ్వకపోతే అమెరికాలో బేకారు లాగే ఉండేవాడివని ఆయన మండిపడ్డారు. 60 ఎకరాలు ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నేడు 600 ఎకరాలు అయిందని, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బాగుపడలేదు అన్నారు. తెలంగాణ ఏర్పడినపుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నేడు సుమారు 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కు భయం పుట్టి రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది లేదని చెప్పారు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్లే రూపాయలు 17 లక్షల నష్టపరిహారం జడ్చర్ల లోని ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ బిడ్డలు కూడా తెలంగాణలో ఉన్నారు కదా వారి పై ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు.ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా కూడా తెలంగాణలో విద్యార్థుల, అమాయకుల ఆత్మ బలిదానాలు చూసి చలించి తెలంగాణను సోనియా గాంధీ ప్రకటించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చెప్పింది చెప్పినట్లే చేసిందని, దేశానికి తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ అని తెలిపారు. అంతేకాకుండా.. ఈ సారి కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి పాలన అంటే ఏంటో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ మాయ మాటలు చెప్పి.. మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ అని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, వచ్చే కురుక్షేత్రం లో కాంగ్రెస్ ని గెలిపించండన్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్ కి అండగా ఉండాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.