Kishan Reddy: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీగా ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో రెండో అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేస్తున్న ఘనత సాధించారని పేర్కొంటూ, ఆయనకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీని “కన్వర్టెడ్ బీసీ” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం అసహనాన్ని కలిగించిందన్నారు. మీ నాయకుడు ఏ సామాజిక వర్గానికి చెందినవారో మీరు ముందుగా చెప్పాలి అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
ఇంకా మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ.. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు 32% మాత్రమే ప్రకటించారు. ఇది బీసీలకు చేసే మోసం. రాష్ట్రంలో GHMC ఎన్నికల్లో బీసీ పేరుతో రిజర్వేషన్లు పెంచి.. లబ్ధి బీసీయేతరులకు చేకూరేలా చేశారని ఆయన ఆరోపించారు. ఒకవైపు ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తూ, బీసీలకు న్యాయం చేస్తున్నట్టు నటించడం దుర్మార్గం. 4% ముస్లిం రిజర్వేషన్లను కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకొని కొనసాగించాయి. ఇప్పుడు అదే రిజర్వేషన్‌ను 10% కు పెంచి బీసీలకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
Aadi srinivas: బీసీ బిడ్డ కాకపోయినా.. సీఎం బీసీ బిల్ తీసుకువచ్చారు..!
అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను చట్టబద్ధం చేసిందని తెలిపారు. ఎంపీల్లో ఎక్కువ మంది బీసీలు బీజేపీ నుంచే ఉన్నారని అన్నారు. ‘మోదీ కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా బీసీల్లో చేర్చారు. విశ్వబ్రాహ్మణుల వంటి వందల కులాలు దశలవారీగా బీసీ జాబితాలో చేర్చబడ్డాయి. ఇప్పుడు మోదీని కన్వర్టెడ్ బీసీ అంటారా?’ అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ నాయకుడిని ప్రధానిగా, ముఖ్యమంత్రిగా చేయలేదని మంది పడ్డారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి అంటూ తెలుపుతూ.. బీసీ ముఖ్యమంత్రిని చేయలేకపోయి, బీసీలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఇకపోతే, మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఆయన ముందుగా చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీసీ నాయకులను విమర్శించడం తగదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెరిగిన రిజర్వేషన్లతోనే జరగాలని బీజేపీ కోరుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుంది. కానీ న్యాయస్థానాల తీర్పులను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నిరాశతో మాట్లాడుతున్నారు.. బీసీలపై కాంగ్రెస్ నాటకాలపై ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఓడిపోతాయని అన్నారు. వెయ్యిమంది రేవంత్‌లు, రాహుల్‌లు వచ్చినా కాంగ్రెస్ గెలవదు.. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతోందని ఆయన వ్యాఖ్యానించారు.