ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్‌కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే వెంటనే స్పందించడం ప్రభుత్వం బాధ్యత. రైతుల సమస్యలపై వెంటనే స్పందించాం. ఏ పంటలు ఎలా ఉన్నాయి, జాతీయ అండ్ అంతర్జాతీయ మార్కెట్లో సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట దెబ్బతింది. 2.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి 3 జిల్లాలలో ఉత్పత్తి అయింది. ఒకేసారి బంపర్ క్రాప్ వచ్చి 7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. బంపర్ క్రాప్ రావడంతో ధర తగ్గింది, కొనే నాధుడు లేడు. మామిడిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో 2, 3 రూపాయలకు రైతులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. తోతాపురి మామిడిని పల్ప్ పరిశ్రమలే ఎక్కువగా కొంటాయి. గతేడాది నిల్వలు ఉండటంతో ఈసారి కొనలేదు. రూ.8కు మామిడి కొనాలని పరిశ్రమలకు చెప్పాం. ప్రభుత్వం నుంచి కిలోకు రూ.4 సాయం చేస్తామని చెప్పాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొనుగోలు జరిగింది. ఇంకా కొంటున్నాం కూడా’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read: AP Assembly Session 2025: ఆగష్టు రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సంగతేంటి?
‘ఒక నాయకుడు ఇప్పుడు తోతాపురిపై బయలుదేరాడు. ఒక ప్లాన్ ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు పన్నుతున్నారు. పాలన సక్రమంగా జరగకూడదని ప్రతిపక్ష పార్టీ పని చేస్తోంది. బంగారుపాళ్యంలో రైతులను పిలిచి మాట్లాడాలి. ఎవరైనా ఒక నాయకుడు ర్యాలీగా వెళితే ఇబ్బందులు వస్తాయి. 500 మంది కంటే ఎక్కువ మందికి పెర్మిషన్ లేదని పోలీసు అధికారులు తెలిపారు. 400 మంది బంగారుపాళ్యంలో హెలికాప్టర్ దగ్గరకు వచ్చి విధ్వంసం చేశారు. హెలిప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతిస్తే.. వందల మంది వచ్చారు. సీఎంగా పని చేసిన ఓ వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీలు చేస్తున్నారు. రైతులను ఆదుకున్నాక పర్యటనలు చేయడం సరికాదు. గత ఐదేళ్లలో మేం పర్యటనలకు వెళ్తామంటే ఇంటివద్దే అడ్డుకునేవారు. రైతు సమస్యలను పరిష్కరించాలన్నది వారి ప్రయత్నం కాదు. సినిమా సెట్టింగ్ వేసి యాత్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టకూడదనే లక్ష్యంతోనే యాత్రలు చేస్తున్నారు. పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి, ఐదారు జిల్లాల నుంచి మందిని తీసుకురావడం ఎందుకు?. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారు’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.