Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైన సమస్యగా మారింది. కిడ్నీలలో ఖనిజాలు (మినరల్స్) ఒకదానికొకటి అతుక్కుని చిన్న లేదా పెద్ద సైజులో ఒక్క గట్టి పదార్థంగా మారడమే కిడ్నీ స్టోన్స్. ఇవి మొదట్లో చిన్నవిగా ఉండి పెద్దవిగా మారి మూత్రనాళంలో కదలినప్పుడు తీవ్రమైన నొప్పి, మంట, మూత్ర విసర్జనలో అడ్డంకి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ఇవి కిడ్నీలకు హాని కలిగించడంతో పాటు తిరిగి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
Crime: ‘‘దృశ్యం’’ తరహా మర్డర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపి, వంటింటిలో పూడ్చిపెట్టిన భార్య..
కిడ్నీ రాళ్లు కాల్షియం స్టోన్, యూరిక్ యాసిడ్ స్టోన్, స్ట్రూవైట్ స్టోన్, సిస్టీన్ స్టోన్ రకాలుగా ఉంటాయి. ప్రతి రకమైన రాయి ఏర్పడటానికి వేర్వేరు కారణాలు, ఆహారపు అలవాట్లు, శరీరపు జీవక్రియ ప్రభావం చూపుతాయి. కిడ్నీ స్టోన్స్ ప్రధాన లక్షణం తీవ్రమైన నొప్పి కలిగించడమే. ఇది సాధారణంగా నడుము, పక్కలు, పొత్తికడుపు కింది భాగంలో అకస్మాత్తుగా మొదలవుతుంది. అలాగే మూత్ర విసర్జనలో మంట, పదేపదే మూత్రం వెళ్లాలనే భావన, మూత్రంలో రక్తం, దుర్వాసనతో కూడిన మూత్రం, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా ఉంటాయి. రాత్రి లేదా ఉదయం సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇక రాయి పెద్దదై మూత్రనాళాన్ని అడ్డుకుంటే మూత్రం ఆగిపోవడం, జ్వరం, చలి వంటి ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపించవచ్చు.
ప్రముఖ డాక్టర్ ప్రకారం.. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది.. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కబడుతుంది. ఇది ఖనిజాలు పేరుకుపోయి రాళ్లుగా మారడానికి దారితీస్తుంది. ఇక రెండో కారణం.. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పెరిగి కిడ్నీలు ఎక్కువ కాల్షియం బయటకు పంపుతాయి. ఇక చివరి మూడో కారణం.. కొందరిలో మెటబాలిజం సమస్యల కారణంగా ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రపిండాలలో పేరుకుపోయి రాళ్లుగా మారుతుంది. అలాగే కుటుంబ చరిత్ర, అధిక బరువు, ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెర, తక్కువ పొటాషియం, అధిక ప్రోటీన్ తీసుకోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం, లేదా కొన్ని మందులను దీర్ఘకాలంగా వాడటం కూడా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీ స్టోన్స్ నివారణ కోసం కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం రోజుకు కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగడం ద్వారా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు సులభంగా బయటకు వెళ్తాయి. ఉప్పు, ప్యాకేజ్డ్ ఆహారాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా సోడియం స్థాయిలను నియంత్రించవచ్చు. ఆక్సలేట్ అధికంగా ఉన్న పదార్థాలను మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా వైద్యుల సలహా మేరకు సరైన కాల్షియం పరిమాణాన్ని పాటించాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపకుండా సమయానికి విసర్జన చేయడం, యూరిక్ యాసిడ్, ఖనిజాల స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం కూడా అవసరం. ఇవన్నీ పాటించడం ద్వారా కిడ్నీ స్టోన్స్ సమస్యను సులభంగా నివారించవచ్చు.