బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా సిద్దం చేస్తున్నారట. హరీష్ రావుతో పాటు ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు.
సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన హరీశ్ రావు.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్‌కు వివరించారు. వీరి భేటీ సుమారు 5 గంటల పాటు సాగింది. నేడు మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు రేపు కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. విచారణ సందర్భంగా కమిషన్‌కు అందించాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
Also Read: Crime News: సరూర్‌నగర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త!
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్లే సమయంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది.