వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ (సీపీఐ, సీపీఎం) పార్టీలతో పొత్తు ఉండదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పింది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎంలు సపోర్ట్ ఇచ్చాయి. లెఫ్ట్ పార్టీల మద్దతుతో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం అసాధ్యమని ప్రత్యర్థి పార్టీలు తెలిపాయి. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగుతుందని వామపక్ష పార్టీలు తెలిపాయి.
Read Also: Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ పార్టీని కోరినట్లు తెలుస్తోంది. అయితే రెండు పార్టీలకు ఒక్కొక్క అసెంబ్లీ సీటును ఇచ్చేందుకు మాత్రమే బీఆర్ఎస్ అధిష్టానం చెప్పింది. దీంతో మూడు పార్టీల మధ్య పొత్తులపై ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల విషయంపై లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనను బీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన లభించలేదు. అయితే, ఇవాళ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాలోని 115 అభ్యర్థులను ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు లేదని బీఆర్ఎస్ అధినేత చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిర్ణయంపై లెఫ్ట్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా లెఫ్ట్ పార్టీలను తమతో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు సొంతంగానే పోటీ చేస్తాయా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనే దానిపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also: Vasantha Krishna Prasad: నేనేంటో అధిష్టానానికి తెలుసు.. ఎమ్మెల్యే హాట్ కామెంట్లు..