మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవిత మాట్లాడుతూ.. “నేను నాకొడుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకుని అమెరికా నుంచి వెళ్లి వచ్చే లోపల మరేదో లేఖ లీకైందని చెప్పి గత రెండు మూడు రోజులుగా హంగామా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. రెండు వారాల కిందట కేసీఆర్‌కి లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా నా అభిప్రాయాలను కేసీఆర్‌కు లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సారి కూడా లేఖ రాశాను. నేను మొన్ననే చెప్పాను. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అని. చెప్పిన కొద్ది రోజుల్లోనే నేను అంతర్గతంగా కేసీఆర్ కి రాసిన ఉత్తరం బహిర్గతం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందో అన్నది మనమందరం ఆలోచించాల్సిన విషయం. నేను వేరే విషయాలు ఏం చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులందరూ అనుకుంటున్న విషయాలు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. తనకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసిన లేఖ. అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతమైందంటే దీని వెనుక ఉన్నది ఎవరు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం.” అని కవిత వ్యాఖ్యానించారు.