Dharmasthala case: కర్ణాటకలోని ధర్మస్థలలో వందల సంఖ్యలో మహిళలు, యువతుల మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని, సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
READ ALSO: Congress MLA KC Veerendra: ఈయన మామూలు ఎమ్మెల్యే కాదు.. బడా బెట్టింగ్ రాజా..!
అనేక వ్యత్యాసాలు.. అసత్య ఆరోపణలు..
ఫిర్యాదుదారుడైన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా 1995 – 2014 మధ్య కాలంలో ధర్మస్థల మందిరంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ సమయంలో మహిళలు, మైనర్లతో సహా అనేక మంది మృతదేహాలను ఖననం చేయవలసి వచ్చిందని, వారిలో కొందరిపై లైంగిక వేధింపుల గుర్తులు ఉన్నాయని ఆయన తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. తాజాగా సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలంలో, సాక్ష్యాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం హెడ్ ప్రణవ్ మొహంతి మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న కారణంగా పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అరెస్ట్ చేశామన్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఫిర్యాదుదారుడిని విచారించామని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలాలు, అందించిన పత్రాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, అందుకే ఈ విచారణ చేపట్టామని పేర్కొన్నారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. నేడు భీమాను కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఈ కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మెడిసన్ చదివే తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందంటూ ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా కట్టుకథేనని తాజాగా ఆమె పేర్కొన్నారు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు శనివారం వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ స్పందించారు. మతపరమైన స్థలం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని, దర్యాప్తు ద్వారా అసలు నిజం బయటపడుతుందని అన్నారు. ఈ ఆరోపణలు అబద్ధమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ ALSO: Kukatpally Sahasra Case: మా బాబు వాణ్ణి చంపేద్దామని అంటున్నాడు.. సహస్ర తల్లి సంచలన వ్యాఖ్యలు