Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో కర్ణాటక పూర్తిగా స్తంభించింది.
కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, చెరకు సాగుదారుల సంఘం, హసిరుసేన, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, సినిమా కళాకారుల సంఘం, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి.. ఇలా వందకు పైగా సంస్థలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 నుంచే ఈ బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరు బస్టాంట్ ముందు రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రైతు సంఘాల దీంతో ఆందోళనలతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. బంద్ దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.
Also Read: Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ హవా.. షూటింగ్‌లో రెండు స్వర్ణాలు, టెన్నిస్‌లో రజతం!
తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కర్ణాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రత భారీగా ఉంది. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులను శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. కావేరీ జలాల విడుదలపై గత మంగళవారమే బెంగళూరులో బంద్ చేపట్టారు. ఆ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.1000 నుంచి 1500కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్ చేపట్టడంతో భారీ నష్టం రానుంది.