Kanpur Scam: పెళ్లికాని ప్రసాద్‌ల పెళ్లి చేసుకోవాలనే కలను ఒక నిత్య పెళ్లికూతురు క్యాష్ చేసుకుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులు ఈ నిత్య వధువును అరెస్టు చేశారు. ఆమె నాలుగు సార్లు వివాహం చేసుకుంది, 12 మందికి పైగా పురుషులను వలలో వేసుకొని బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఆమె పోలీసు అధికారులు, వైద్యులను కూడా ట్రాప్ చేసిందని, నిత్య వధువు పేరు దివ్యాన్షి చౌదరి అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Operation Sindoor: ఇది భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోలేని పాకిస్తాన్..
కోట్లు దోచుకున్న కిలేడి..
ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. దివ్యాన్షి చౌదరి చాలా చాకచక్యంగా ఉంటుందని, ఆమె మొదట పురుషులతో స్నేహం చేస్తుందని, ఆ తరువాత ప్రేమ సంబంధాలను పెంచుకుంటుందని అన్నారు. ఆ తర్వాత పెళ్లి పేరుతో వారిని శారీరక సంబంధాలలోకి దింపుతుంది, ఆపై అకస్మాత్తుగా వారిపై అత్యాచారం ఆరోపణలు చేసి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందని చెప్పారు. బాధితురాలు భయపడి, రాజీకి ప్రయత్నించినప్పుడు, దివ్యాన్షి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తుందని, ఈ విధంగా ఆమె అనేక మంది పోలీసులు, బ్యాంకు అధికారులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాన్షి 10 బ్యాంకు ఖాతాలలో మొత్తం రూ.8 కోట్ల లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలినట్లు పోలీసు వెల్లడించారు. ఈ డబ్బులో కొంత భాగాన్ని మీరట్ జోన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్, ఇతర పోలీసు అధికారులకు కూడా బదిలీ చేశారని తెలిపారు. తను ఒంటరిగా పనిచేయడం లేదని, దివ్యాన్షికి ఒక నెట్‌వర్క్ ఉందని, ఇది అత్యంత కుట్రపూరితంగా పనిచేస్తోందని చెప్పారు. ఆమె కేవలం నిత్య పెళ్లికూతురుగానే కాకుండా, బ్లాక్‌మెయిల్, దోపిడీ రాకెట్‌ను కూడా నడుపుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల ఈ కిలేడి కాన్పూర్ పోలీస్ కమిషనర్ అఖిల్ కుమార్‌కు గ్వాల్టోలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఆదిత్య లోచన్‌పై ఫిర్యాదు చేసింది. తాను ఆదిత్యను వివాహం చేసుకున్నానని, ఆయన ఇప్పుడు తన డబ్బును దోచుకుంటున్నాడని, ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు, విషయం ఆమె ఫిర్యాదుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని తేలింది. వారి వివాహం తర్వాత, దివ్యాన్షి తనను వివిధ మార్గాల ద్వారా డబ్బు ఇవ్వాలని నిరంతరం బలవంతం చేస్తోందని, అనేక సందర్భాల్లో తనను బెదిరించిందని ఇన్‌స్పెక్టర్ ఆదిత్య వెల్లడించారు.
దివ్యాన్షి గతంలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లను కూడా ఇలాంటి తప్పుడు అత్యాచార కేసుల్లో ఇరికించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె వారిపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, జైలు శిక్ష విధిస్తామని బెదిరించి, ఆపై సెటిల్మెంట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసేదని పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో తెలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ కిలేడి డజనుకు పైగా వ్యక్తులను మోసం చేసి, నాలుగు సార్లు వివాహం చేసుకుంది. బాధితుల్లో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లుగా, ఇద్దరు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆమె చెప్పే విషయాల ఆధారంగా తన వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
READ ALSO: Maoist Leader Hidma: మావోయిస్టు అగ్ర నేత హిడ్మా మృతి.. నిర్ధారించిన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్