Leaders Sentenced: బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐదు ఆరోపణలలో మూడింటిలో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. అయితే మరణశిక్ష పడ్డ మొదటి ప్రధానమంత్రి ఆమె మాత్రమే కాదు. గతంలో కూడా అనేక దేశాలు అగ్ర నాయకత్వానికి మరణశిక్షలను కోర్టులు విధించాయి. ఇంతకీ ఆ దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: IBomma Ravi : ఐబొమ్మ రవికి ఇంత మద్దతా.. ఎందుకో ఇండస్ట్రీ ఆలోచించిందా?
గత ఏడాది జూలై తిరుగుబాటు సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు గాను మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌లకు కోర్టు మరణశిక్ష విధించింది. హత్యకు ప్రేరేపించడం, హత్యకు ఆదేశించడం వంటి నేరాలకు వారిని దోషులుగా కోర్టు నిర్ధారించింది.
మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్: పర్వేజ్ ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారనే ఆరోపణలతో కూడిన రాజద్రోహం కేసులో 2019లో ఆయనకు మరణశిక్ష విధించారు. ఈ శిక్షను 2020లో రద్దు చేశారు. అయితే పర్వేజ్ ముషారఫ్ 2023లో దుబాయ్‌లో ప్రవాసంలో మరణించారు.
జార్జియోస్ పాపాడోపౌలోస్: జార్జియోస్ పాపాడోపౌలోస్ గ్రీస్ అధ్యక్షుడు. 1967 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఈ సైనిక నియంతను 1973లో పదవీచ్యుతుడయ్యాడు. రాజద్రోహం, తిరుగుబాటు ఆరోపణలపై విచారణ తర్వాత 1975లో ఆయనకు మరణశిక్ష విధించారు. తరువాత శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఆయన 1999లో జైలులో మరణించారు.
చున్ డూ-హ్వాన్: చున్ డూ-హ్వాన్ దక్షిణ కొరియా అధ్యక్షుడి (1980-1988) గా పని చేశారు. 1979 సైనిక తిరుగుబాటు, 1980 గ్వాంగ్జు ఊచకోతలో ఆయన పాత్రకు 1996లో మరణశిక్ష విధించారు. తరువాత ఆయన శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 1997లో ఆయనకు క్షమాభిక్ష లభించింది. ఆయన 2021లో మరణించారు.
సద్దాం హుస్సేన్ : సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా (1979-2003) పని చేశారు. 1982లో దుజైల్‌లో 148 మంది షియా ముస్లింలను ఊచకోత కోసిన కేసులో మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సద్దాం హుస్సేన్‌కు 2006లో మరణశిక్ష విధించారు. డిసెంబర్ 30, 2006న అతన్ని ఉరితీశారు.
మహ్మద్ నజీబుల్లా : మహ్మద్ నజీబుల్లా ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా (1987-1992) పని చేశారు. 1996లో తాలిబన్లు మొహమ్మద్ నజీబుల్లాకు మరణశిక్ష విధించారు. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆయనను UN కాంపౌండ్ నుంచి బంధించి, హింసించి, సెప్టెంబర్ 1996లో బహిరంగంగా ఉరితీశారు.
జుల్ఫికర్ అలీ భుట్టో : జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్థాన్ అధ్యక్షుడు (1971-1977) గా పని చేశారు. దేశంలో 1977లో జరిగిన సైనిక తిరుగుబాటులో జుల్ఫికర్ అలీ భుట్టో పదవీచ్యుతుడయ్యారు. తరువాత కాలంలో తన రాజకీయ ప్రత్యర్థి హత్యకు కుట్ర పన్నినందుకు ఆయనకు మరణశిక్ష విధించారు. అంతర్జాతీయ అప్పీళ్లు ఉన్నప్పటికీ, ఆయనను ఏప్రిల్ 1979లో ఉరితీశారు.
అమీర్-అబ్బాస్ హోవైడా: అమీర్-అబ్బాస్ హోవైడా ఇరాన్ ప్రధాన మంత్రిగా (1965-1977) పని చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత “దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం”, అవినీతి వంటి ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 1979లో ఆయనను ఫైరింగ్ స్క్వాడ్ ఉరితీసింది.
READ ALSO: Vijayawada: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. అగ్రనేత హిడ్మా ఎన్*కౌంటర్!