Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు కుంగిపోయినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర భూభాగంలో సుమారు 35 శాతం మేరకు సాగునీరు అందుతోందని వివరించారు.
Ponywallahs Revenue: గుర్రాలకు పని లేక.. ఆగిన బతుకు చక్రం..
ఇప్పటికే ఈటల రాజేందర్, గతంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలపై కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు హరీష్ రావు హాజరుకావడం, ఆయన ఏవిధంగా స్పందిస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కమిషన్, కాళేశ్వరం నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు, డిజైన్ దోషాలు, నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనలు, ఆర్థిక దుర్వినియోగంపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకుని, వాటిని ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
ఇంకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 11న విచారణకు హాజరుకానున్నారు. కమిషన్ విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ ప్రతినిధుల నుంచి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కమిషన్ తన తుది నివేదికను ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.