మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా?
జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్నా….పార్టీ సిద్ధాంతం చుట్టే ప్రసంగాలు తిరిగేవి. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు వేదికలవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసుకొని ఎవరి బాధను వాళ్లు వినిపించుకోవచ్చు. కానీ వాడుతున్న భాష పట్లనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు.. అన్ని పార్టీల నేతలు దూషణల పర్వాన్ని ఎంచుకుంటున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తాను చెప్పాలనుకున్న అంశాలను చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి పట్ల అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ వాదన. ఏక వచనం సంగతి పక్కన పెడితే… లో లెవెల్ డైలాగులు పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎంని ఉద్దేశించి.. దుర్మార్గుడని.. మగాడివైతే.. లాంటి డైలాగులతో పాటు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకూ ఈ వ్యవహారం వెళ్ళింది.
బీఆర్ఎస్ నుంచి వస్తున్న డైలాగులకు… సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో సమాధానం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులు కొంత సంమయమనం పాటించినా…బీఆర్ఎస్ నుంచి రెచ్చగొట్టే డైలాగులు వస్తున్నాయి అనేది కాంగ్రెస్ వాదన. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా… జూబ్లీహిల్స్ లో చెత్త పేరుకు పోవడానికి ఆ చెత్త నా కొడుకే కారణం కదా అంటూ మాటలు దొర్లాయి. ఇక బిజెపికి సవాల్ విసిరే ప్రయత్నంలో జూబ్లీహిల్స్ లో కింగ్ అయ్యేది తామే అంటూ కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. దానికి బిజెపి కింగ్ కాదు బొంగు కాదు అంటూ సెటైర్లు వేసుకుంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో నాయకులు విచ్చలవిడిగా… లోలెవెల్ లాంగ్వేజ్ ని వాడుతున్నారనేది ఓపెన్ టాక్. అది ఎవరు మొదలుపెట్టారు… ఎవరు కొనసాగిస్తున్నారన్న విచక్షణ రాజకీయ నాయకులకే ఉండాలంటున్నారు జనం.